ILO | స్పెషల్ టాస్క్ బ్యూరో : పనిచేయగల సామర్థ్యం ఉన్న యువశక్తిని వినియోగించుకోలేని ఏ దేశమూ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేదంటారు నిపుణులు. ఈ విషయంలో భారత్ ఎంతో వెనుకంజలో ఉన్నది. దేశంలో 15-34 ఏండ్ల మధ్య వయసు ఉండి, పనిచేయగల సామర్థ్యమున్న యువతలో దాదాపు పాతిక శాతం మంది ఏ పనీలేకుండా రోడ్ల మీద తిరుగుతున్నట్టు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదికలో వెల్లడించింది.
ప్రపంచ సగటు 20.4 శాతంతో పోలిస్తే, భారత్లోనే పనిలేకుండా ఉన్న యువత ఎక్కువగా ఉన్నట్టు నివేదిక వివరించింది. తగిన ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవ్వడమే దీనికి కారణంగా తెలిపింది. కాగా, దేశంలో ఉద్యోగ సంక్షోభం గతంలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న కొలువులను కాపాడుకోవడానికి కూడా ఉద్యోగులు తీవ్రస్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తుండటం ఆందోళనకరంగా మారింది.