న్యూఢిల్లీ: భారత విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పును ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేగంగా క్షీణిస్తుండగా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు పెరిగిపోతున్నాయి. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం రాజ్యసభ ముందు ఉంచింది. గత ఐదేండ్లలో దేశంలో 18,727 ప్రభుత్వ పాఠశాలలు మూతపడడంపై సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ప్రమాదకరమని ఎక్స్ పోస్టులో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ప్రత్యేకంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వెన్నెముక లాంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్రమంగా క్షీణించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య పెరుగుతుండడాన్ని ఆయన ప్రస్తావించారు.
అధికారికంగా ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 2020-21లో దేశంలో 10,32,049 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2024-25లో ఆ సంఖ్య 10,13,322కి తగ్గిపోయింది. ఐదేండ్లలో మొత్తం 18,727 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. ఇది అనేక రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితికి అద్దం పడుతుంది. హేతుబద్ధీకరణ, తక్కువ నమోదు ఉన్న పాఠశాలల విలీనం, జనాభా మార్పులు వంటి కారణాలు తరచుగా చెబుతున్నప్పటికీ క్షీణత స్థాయి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది.
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల విస్తరణ ఇటీవలి కాలంగా గణనీయంగా కనపడుతున్నది. 2023-24లో 3,31,108 ప్రైవేట్ స్కూళ్లు ఉండగా 2024-25లో ఆ సంఖ్య 3,39,583కి పెరిగింది. అంటే కేవలం ఒక ఏడాదిలో 8,475 ప్రైవేట్ స్కూళ్లు అదనంగా వచ్చాయి. ఈ పెరుగుదల విద్యారంగంలో పెరుగుతున్న ప్రైవేట్ ఉనికిని సూచిస్తుంది. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల పట్ల పెరుగుతున్న మోజును తెలియజేస్తుంది.
