న్యూఢిల్లీ: పెగాసెస్ స్థానంలో కొత్త నిఘా సాఫ్ట్వేర్ ‘కాగ్నైట్’ను కొనుగోలు చేశారా? లేదా? అన్నదానిపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రూ.986 కోట్లతో నిఘా సాఫ్ట్వేర్ను కొనడానికి కేంద్రం సిద్ధమైందని, ప్రజల సొమ్ముతో ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై నిఘాకు తెరలేపిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. కాగ్నైట్ను ఉపయోగించేందుకు సాఫ్ట్వేర్ పరికరాల్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ నుంచి భారత రక్షణశాఖ ఏజెన్సీ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మన దేశ పాలకులకు దేని మీదా విశ్వాసం లేదు. ఎన్జీవో, న్యాయస్థానాలు, పౌర సంఘాలు, మీడియా అన్నింటిపైనా అనుమానాలే. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బులతో ప్రజలపైనే నిఘా పెడుతున్నారు. కొత్త నిఘా సాఫ్ట్వేర్ ‘కాగ్నైట్’ కోసం కేంద్రం దాదాపు రూ.986 కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వ విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా చర్యలకు తెరలేపిందన్న వార్తలు వచ్చాయి. నిఘా పరికరాల కొనుగోలు జరిగిందా? లేదా? అన్నది కేంద్రం బయటపెట్టాలి’ అని మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు.