ముంబై: అహ్మదాబాద్లో జూన్ 12న కూలిపోయిన ఏఐ171 విమానం సిబ్బంది తాము పొందిన శిక్షణకు అనుగుణంగా సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించారని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) ఆదివారం పేర్కొంది. ఊహాజనిత అంశాల ఆధారంగా పైలట్లను నిందించరాదని తెలిపింది. పైలట్ ఆత్మహత్య చేసుకున్నట్లు కొన్ని వర్గాలు చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు, తుది నివేదిక ప్రచురితమయ్యే వరకు కచ్చితమైన సమాచారం లేని ఊహలు ఆమోదయోగ్యం కాదని, అవి ఖండించదగినవని పేర్కొంది. ఈ సంఘం ఎయిరిండియాకు చెందిన నేరో-బాడీ పైలట్స్కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
కొన్ని మీడియా సంస్థల్లో ఊహాజనిత కథనాలు ప్రచారమవుతుండటం అత్యంత బాధాకరంగా ఉందని తెలిపింది. పైలట్ ఆత్మహత్య అంటూ నిరాధారమైన, నిర్లక్ష్యపూరితమైన చర్చ జరుగుతున్నదని పేర్కొంది. అసంపూర్ణమైన లేదా ప్రాథమిక సమాచారం లేకుండా ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేయడం బాధ్యతారహితం మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు బాధాకరమని వివరించింది. పైలట్లకు విస్తృత స్థాయిలో మానసిక, వృత్తిపర పరీక్షలు జరుగుతాయని, మళ్లీ మళ్లీ శిక్షణ పొందుతారని, అత్యధిక ప్రమాణాలతో కూడిన భద్రత, బాధ్యత, మానసిక ఫిట్నెస్తో పని చేస్తారని వివరించింది.