న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఉత్తేజం నెలకొంది. పంజాబ్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి ఆప్‌నకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెజ్లర్ ఖలీతో కలిసున్న ఫోటోను కేజ్రీవాల్ గురువారం ట్వీట్ చేశారు. విద్యుత్, నీరు, విద్య, వైద్య రంగాల్లో ఆప్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఖలీ ప్రశంసించారని పేర్కొన్నారు.
పంజాబ్‌లో పెద్దసంఖ్యలో అభిమాన గణం ఉన్న ఖలీ మద్దతు లభించడం అసెంబ్లీ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక 2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్‌నకు 20 అసెంబ్లీ స్ధానాలు దక్కాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్ ఇప్పటికే పది మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ఇటీవల ప్రకటించింది.