కేదార్నాథ్, అక్టోబర్ 26: కేదార్నాథ్ ప్రధానాలయ గర్భగుడిలో బంగారు రేకుల తాపడం పూర్తయింది. సుమారు 550 బంగారు రేకులతో అంతరాలయాన్ని అలంకరించారు. గత మూడురోజులుగా జరుగుతున్న అలంకరణ పనులు బుధవారం ఉదయం పూర్తయ్యాయని శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మీడియాకు చెప్పారు.
ఐఐటీ రూర్కీ తదితర సంస్థలకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం ఆలయాన్ని సందర్శించి అలంకరణ పనులను పరిశీలించిందని చెప్పారు. వారి సూచనల మేరకే అలంకరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. బంగారు రేకులను 18 కంచర గాడిదలపై తరలించారని, ఇద్దరు ఏఎస్ఐ అధికారుల పర్యవేక్షణలో 19 మంది పనివారు రేకులను రాతిగోడలకు తాపడం చేశారని అజయ్ వివరించారు. స్వర్ణ తాపడంతో గర్భాలయానికి కొత్త శోభ వచ్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.