Kotiswar Singh | న్యూఢిల్లీ: మణిపూర్ నుంచి తొలిసారిగా ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీలుగా నియమించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్రానికి ఇద్దరి పేర్లను సిఫార్సు చేసింది. అందులో మణిపూర్‌కు చెందిన, ప్రస్తుతం జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఎన్ కోటీశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహదేవన్ ఉన్నారు.
సింగ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా నియమిస్తే ఈశాన్య రాష్ర్టానికి చెందిన వ్యక్తికి తొలిసారిగా ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుందని కొలీజియం ఒక ప్రకటనలో పేర్కొంది. తమిళనాడుకు చెందిన మహదేవన్ వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు ఇటీవల ఇద్దరు పదవీ విరమణ చేయడంతో ఆ స్థానాల భర్తీ కోసం కొలీజియం తాజా సిఫారసులు చేసింది.