హైదరాబాద్, ఫిబ్రవరి 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు చెందిన ఎప్స్టీన్ ఫైల్స్ దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ పేరు ఈ ఫైల్స్‌లో ప్రస్తావనకు రాగా, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. భారత్‌లో జరిగే ఓ పెండ్లికి తన సన్నిహితురాలు తప్పనిసరిగా హాజరవ్వాలని, దానికోసం వెంటనే వీసాను జారీ చేయాలని ఎప్స్టీన్.. హర్దీప్కు ఓ మెయిల్ రాయగా, ఆయన వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేశారు.
ఈ మేరకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హర్దీప్-ఎప్స్టీన్ మధ్య మెయిల్ రూపంలోని సంభాషణనూ ఆమె అప్లోడ్ చేశారు. దీంతో ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఇంకెంతమంది బీజేపీ పెద్దలు బయటకు వస్తారో? అంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతున్నది.