న్యూఢిల్లీ, జనవరి 10: కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్‌లిస్ట్‌లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల కేసులో గురువారం తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపింది.
2001 నుంచి 2012 మధ్య జేకేసీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఫరూక్ అబ్దుల్లా అధికార దుర్వినియోగానికి పాల్పడి నిధులు అక్రమంగా వినియోగించినట్టు ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇప్పటికే ఈడీ నుంచి నోటీసులు అందుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఫరూక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో ముఖ్యనేతలు కావడం గమనార్హం.