(పాశికంటి శంకర్ భీవండి)
ముంబై జూలై 25, (నమస్తే తెలంగాణ): దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, మణిపూర్ వీడియో అంశంపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ మంగళవారం ముంబైలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. బీఆర్ఎస్ ముంబై ప్రాంత అధ్యక్షుడు హేమంత్ కుమార్బడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి మూడు నెలలు గడిచినా డబుల్ ఇంజిన్ సర్కారు మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు.
అనంతరం థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ గోపినాథ్ ఠోంబరేకు వినతిపత్రం అందజేశారు. మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ కొంకణ్ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె, బీఆర్ఎస్ నేతలు హేమంత్ బర్డే, ఠాణే జిల్లా సమన్వయకర్త దిగంబర్ విశే, కళ్యాణ్ నియోజకవర్గ సమన్వయకర్త జయప్రకాశ్ పవార్, బీవండి లోకసభ సమన్వయకర్త యెలిగేటి శ్రీనివాస్, ముంబ్రా-కళ్వా అసెంబ్లీ సమన్వయకర్త దొనకొండ సంతోష్, బేలాపూర్ అసెంబ్లీ సమన్వయకర్త వంగల కృష్ణయాదవ్, బీవండి పశ్చిమ సమన్వయకర్త సిరిమల్లె శ్రీనివాస్, బీవండి తూర్పు సమన్వయకర్త సిరిపురం తిరుపతి, నాయకులు డాక్టర్ వినాయక్ వకారే, భోగ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.