న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి చెందుతుండటంతో మానవులకు ముసలితనం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోడ్ రాయడం, ఇమేజెస్‌ను సృష్టించడం, సంగీతాన్ని సమకూర్చడం వంటివాటికి మించి మానవ శరీరంలోని కణాలను యవ్వనంగా మార్చే దిశగా ఏఐ దూసుకెళ్లబోతున్నది. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ ప్రకటించింది. సిలికాన్ వాలీలోని స్టార్టప్ కంపెనీ రెట్రో బయోసైన్సెస్ సహకారంతో జీపీటీ-4బీ మైక్రోను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. దీనికి ప్రత్యేకంగా ప్రొటీన్ సీక్వెన్సెస్, బయలాజికల్ లిటరేచర్, 3డీ మాలెక్యులార్ స్ట్రక్చర్స్‌పై శిక్షణనిచ్చినట్లు పేర్కొంది.
సంప్రదాయ చాట్బాట్ల మాదిరిగా కాకుండా ఈ జీపీటీ-4బీ మైక్రోను ప్రొటీన్స్‌ను రీడిజైన్ చేసేలా రూపొందించారు. రీజనరేటివ్ మెడిసిన్‌కు ముఖ్యమైనవి ప్రొటీన్లు. ప్రొటీన్లతో కూడిన యమనక ఫ్యాక్టర్స్‌ను పునరాలోచించాలని చెప్పారు.వయోజన కణాలను తిరిగి శరీరపు అంతర్గత మరమ్మతు వ్యవస్థగా పని చేసే స్టెమ్ సెల్స్‌గా రీప్రోగ్రామ్ చేసే పనిని అప్పగించారు. ఈ పనిని జీపీటీ-4బీ మైక్రో విజయవంతంగా నిర్వహించింది. అంటే, ఏఐ సృష్టించిన ప్రొటీన్లు వృద్ధ కణాలను జవసత్వాలతో కూడిన యవ్వన కణాలుగా ప్రవర్తించేలా చేశాయి.