కోజికోడ్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేరళలో మరోసారి ప్రాణాంతక నిపా వైరస్ వెలుగుచూసింది. ఇది సోకడంతో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది. మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. కోజికోడ్‌లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు మాస్కులు వాడాలని సూచించింది.
సీఎం పినరాయి విజయన్ మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నదని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందిస్తూ కేరళలో సంభవించిన రెండు మరణాలకు నిపా వైరసే కారణమని ధ్రువీకరించారు. కేరళ ప్రభుత్వానికి సహకరించడానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపామని తెలిపారు.
ఎలా వ్యాపిస్తుంది?
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండే వారికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది.
లక్షణాలు, చికిత్స?
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.