న్యూఢిల్లీ, ఆక్టోబర్ 11: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఆకలి కేకలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వెలువరించిన 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానంలో ఉంది. ఐర్లాండ్‌కు చెందిన కంసర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ సూచీని విడుదల చేశాయి. ఇందులో ఎక్కువ స్కోర్, ర్యాంకు సాధించిన దేశాలు ఆకలి సంక్షోభంలో తీవ్రంగా ఉన్నట్టు లెక్క. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్, మయన్మార్‌తో పాటు నేపాల్ లాంటి మన పొరుగు దేశాలు ఈ సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ సూచీలో భారత్‌ను 29.3 స్కోర్‌తో ‘ఆందోళనకర’ విభాగంలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు మాత్రమే ‘ఆందోళనకర’ విభాగంలో ఉండగా, ఇందులో భారత్ ఒకటి. 2000 సంవత్సరంలో భారత్ స్కోర్ 38.4, 2008లో 35.2, 2016లో 29.3 ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. గత రెండు దశాబ్దాలుగా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఇంకా భారత్‌లో ఆకలి కేకలు తగ్గడం లేదని ఈ సూచీలో స్పష్టమైంది.
భారత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం తీవ్రంగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. చైల్డ్ వేస్టింగ్ రేటు(పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం)లో 18.7 శాతంతో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. చైల్డ్ స్టంటింగ్ రేట్(పిల్లల్లో వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల లేకపోవడం) భారత్‌లో 35.5 శాతం ఉండగా, ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాల రేటు 2.9 శాతంగా ఉంది. దేశంలో పోషకాహార లోపం 13.7 శాతం ఉంది. భారత్‌లో 2000వ సంవత్సరం నుంచి పిల్లల మరణాల రేటు తగ్గినప్పటికీ చైల్డ్ వేస్టింగ్ రేట్, స్టంటింగ్ రేట్ సంక్షోభ స్థాయిలోనే ఉందని ఈ నివేదిక పేర్కొన్నది