సహరాన్పూర్: ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, కాన్షీరామ్ & భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై హత్యాయత్నం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంధ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆజాద్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన దుండగులు చంద్రశేఖర్ ఆజాద్ లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ చంద్రశేఖర్ ఆజాద్ శరీరంలోకి దూసుకెళ్లి బయటికి వెళ్లిపోయింది. దాంతో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆజాద్ వెంట ఉన్నవాళ్లు ఆయనను వెంటనే సహరాన్‌పూర్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం ఆజాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.