గువాహటి, మే 5: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్యాన్ని బాగా తగ్గించిందని, అందుకే 126 సీట్లున్న అసెంబ్లీలో 102 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయాన్ని సాధించిందని అంటున్నారు. 2023లో చేపట్టిన డీలిమిటేషన్ వల్ల కొన్ని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడంతో అప్పటివరకు ముస్లింలకు కేటాయించిన పలు సీట్లను ఆదివాసీ వర్గాలకు కేటాయించారు. దీని కారణంగా బీజేపీ, దాని సంకీర్ణ పార్టీలకు ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరిగింది.
గత ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల బ్యాంక్ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించేది. ముఖ్యంగా 35 స్థానాల్లో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ విజయంలో వారి ప్రభావం బాగా ఉండేది. అయితే పునర్విభజన తర్వాత ఆ ప్రభావాన్ని 25 సీట్ల కన్నా తక్కువకు చేశారు.
ప్రస్తుతం విపక్షాలు నెగ్గిన 24 సీట్లు కూడా డీలిమిటేషన్ ప్రభావానికి లోను కాని నియోజకవర్గాలు కావడం గమనార్హం. కాగా, అస్సాంలో పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నికకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి జేడీ నడ్డాను బీజేపీ నియమించింది. కో అబ్జర్వర్‌గా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ వ్యవహరించనున్నారు.