Siddaramaiah | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ముడా, వాల్మీకి కుంభకోణాలతో సర్వత్రా విమర్శలు మూటగట్టుకొన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరి భవనానికి అదనపు హంగులు జోడించడం కోసం ప్రభుత్వం రూ. 2.6 కోట్లను కేటాయించింది.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. కావేరి భవనంలో సీఎం కొత్త సహాయకుడి కోసం ఓ ప్రత్యేక గది నిర్మాణం, ఆ గదికి బాత్రూమ్, అదనపు స్టోరేజీ రూమ్స్, ర్యాక్లు, కిచెన్ సామాను, కొత్త విద్యుత్తు దీపాలు, వాటర్ ట్యాప్లు, ఏసీ తదితరాల కోసం మొత్తంగా రూ. 2.6 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇలాంటి వృథా ఖర్చులు చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ మండిపడ్డారు.
సీఎం సొంత ఖర్చులతో తన నివాసానికి అదనపు హంగులు చేయించుకొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిద్ధూ సర్కారు.. ప్రజాధనాన్ని అభివృద్ధికి వినియోగించకుండా ఇలా ఆడంబరాలకు ఖర్చు చేయడమేంటని విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.