కోల్‌కతా, సెప్టెంబర్ 16: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వస్తున్నది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. 30 మంది వైద్యుల బృందం దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం సహా ఉన్నతాధికారులతో సమావేశమైంది. చర్చల వివరాలను నమోదు చేసేందుకు తమతో పాటు ఇద్దరు స్టెనోగ్రాఫర్లను సైతం వైద్యులు వెంట తెచ్చుకున్నారు. ప్రభుత్వం ముందు వైద్యులు ఐదు కీలక డిమాండ్లను పెట్టారు. వైద్యురాలి హత్యాచార ఘటన, ఆధారాలు ధ్వంసం చేయడంలో ప్రమేయం ఉన్న అందరినీ శిక్షించాలని, ఆర్జీ కర్ ప్రిన్సిపల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీనామా చేయాలని, వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, దవాఖానల్లో బెదిరింపు ధోరణులను నిరోధించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అయితే, వీటిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.