న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఈ ఆర్థిక సంవత్సరం రెండవ సగ భాగమైన అక్టోబర్-మార్చిలో కేంద్రం రూ.6.77 లక్షల కోట్లు అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ విలేకర్లతో మాట్లాడుతూ, ఈ సంవత్సరానికి మొత్తం స్థూల రుణాలు రూ.14.72 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది ప్రాథమిక అంచనాల కంటే రూ.10వేల కోట్లు తక్కువ ఉందని చెప్పారు.
‘ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 4.8 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 4.4 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది’ అని ఆమె తెలిపారు. ఏప్రిల్-సెప్టెంబర్లో కేంద్రం రూ.7.95 లక్షల కోట్లు అప్పులు చేయగా, ఇకపై 22 వారాలపాటు(మార్చి 2026 వరకు) సాగే బాండ్ల వేలం పాట ద్వారా మార్కెట్లో మరో రూ.6.77 లక్షల కోట్లను సమీకరించబోతున్నది.