న్యూఢిల్లీ: బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సల్ఫర్ (గంధకం) ఉద్గారాల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఫలితంగా, విద్యుత్తు వ్యయాలు ప్రతి యూనిట్‌కు 25-30 పైసలు తగ్గవచ్చునని అధికారులు చెప్పారు. విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విడుదలయ్యే వాయువుల నుంచి సల్ఫర్‌ను తొలగించేందుకు ఫ్లూ-గ్యాస్ డీసల్ఫ్యూరైజేషన్ (ఎఫ్‌జీడీ) సిస్టమ్స్‌ను అమర్చడం తప్పనిసరి అని 2015నాటి నిబంధనలు చెప్తున్నాయి.
ఈ నిబంధనలను సవరిస్తూ తాజాగా ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం 10 లక్షలకుపైబడిన జనాభాగల నగరాల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్లాంట్లు మాత్రమే ఎఫ్‌జీడీ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీనివల్ల దేశంలోని దాదాపు 79 శాతం థర్మల్ పవర్ కెపాసిటీకి ఉపశమనం దొరుకుతుంది.