(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్లో బీబీసీ కోసం పనిచేసే విదేశీ పాత్రికేయుల వీసా పొడిగించకుండా కేంద్రం కావాలనే తాత్సారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సదరు జర్నలిస్టులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇషారా ధన్శేఖర్, అమండా అబేసూర్యలు తమ వీసా గడువును పొడిగించాలని పెట్టుకొన్న దరఖాస్తుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇది కేంద్రం కక్ష సాధింపేనని పలువురు పాత్రికేయులు ఆరోపిస్తున్నారు. బీబీసీ లండన్ కార్యాలయం నుంచి భారత్కు వచ్చే జర్నలిస్టులు కూడా వీసాలు పొందటానికి ఇబ్బందులు పడుతున్నారని బీబీసీ జర్నలిస్టు ఒకరు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ఆఫీసును చిన్న భవనంలోకి మార్చి కార్యకలాపాలను కుదించుకోవాలనే యోచనలో బీబీసీ ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే బీబీసీలో పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.