Chargers | న్యూఢిల్లీ, జూన్ 23: ఒక్కో బ్రాండ్ ఫోన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ పోర్ట్ ఉండటం మొబైల్ యూజర్లకు పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం రాబోతున్నది. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానున్నది. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్ వరకు డెడ్‌లైన్ విధించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటిలోగా స్మార్ట్ఫోన్ల కంపెనీలు అన్ని కొత్త ఉత్పత్తులను సీ టైప్ చార్జింగ్ పోర్ట్‌తో మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ నిబంధనను అమలు చేస్తున్నది.
భారత్‌లో మొదట ఈ నిబంధనను 2025 మార్చి నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ గడువు జూన్‌కు మార్చింది. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లను కూడా సీ టైప్ చార్జింగ్ పోర్ట్‌తో తయారుచేసేలా నిబంధనను రూపొందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెద్ద సవాల్‌గా మారిన నేపథ్యంలో ఒకే రకమైన చార్జింగ్ పోర్ట్ విధానం అమలులోకి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే యాపిల్ సహా చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు టైప్ సీ చార్జింగ్ పోర్ట్‌లతో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి.