న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నామని అనుకొంటున్న తరుణంలో ‘నిన్ను వదల బొమ్మాలి’ అంటూ మరోసారి తరుముకొస్తున్నది. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని, నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. చైనా, ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పండుగ సీజన్లో జాగ్రత్త..
సమీక్ష సమావేశం అనంతరం నీతిఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారిలో 27-28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకొన్నారని పేర్కొన్నారు. బూస్టర్ తీసుకోవడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ప్రజలకు సూచించారు. భయపడాల్సిన పనిలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు తప్పనిసరిగా మాస్కు, ఇతర కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. పలు దేశాల్లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మంత్రి మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఆరు వారాలుగా కేసులు పెరుగుతుండగా, ఈనెల 19తో ముగిసిన వారంలో రోజుకు సగటున 5.9 లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో భారత్‌లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ సగటున 158 వెలుగుచూశాయి.
జోడో యాత్ర వాయిదా వేసుకోండి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి మన్షుఖ్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, సాధ్యం కాకుంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాత్రను వాయిదా వేసుకోవాలని కోరారు. ముగ్గురు రాజస్థాన్ బీజేపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. కాగా, లేఖపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ కరోనా నిబంధనలు పాటించారా? అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. కర్ణాటక, రాజస్థాన్‌లో బీజేపీ ర్యాలీలు చేపట్టిన విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రస్తావించారు.
అమెరికాలో 10 కోట్ల కేసులు
కరోనా ప్రారంభం నుంచి అమెరికాలో ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కేసులు నమోదైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. తాజా అప్డేట్ ప్రకారం మొత్తంగా 10,00,03,837 కేసులు రిజిస్టర్ కాగా, 10,88,236 మంది కరోనాతో మరణించారని తెలిపింది. మరోవైపు చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఆంక్షల సడలింపు తర్వాత కేసుల పెరుగుదల నేపథ్యంలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. దాదాపు 15 లక్షల మంది మరణించే అవకాశం ఉన్నదని ఎకనమిస్టు నివేదిక పేర్కొన్నది.
భారత్‌లో నాలుగు బీఎఫ్.7 కేసులు
చైనాలో కేసుల పెరుగుదలకు కారణంగా భావిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు నమోదైనట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ బయోటెక్నాలజీ రిసెర్చ్ సెంటర్ తొలి కేసు గుర్తించింది. గుజరాత్లో బీఎఫ్.7 సబ్ వేరియంట్ కేసులు రెండు నమోదు కాగా, ఒడిశాలో మరో రెండు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. ఈ బీఎఫ్.7కు వేగంగా వ్యాప్తించే ప్రభావం ఉన్నదని, రీఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సిన్ తీసుకొన్నవారికి కూడా సోకే సామర్థ్యం దీనికి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.