న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా లెక్కల్ని సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభం కానున్నది. జనగణన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ), జన గణన కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ, ‘ ఈసారి తొలిసారిగా పౌరులు ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ ద్వారా స్వయంగా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు.
ఇది ఇంటింటి సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందు అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు. భారత్‌లో నివసిస్తున్న పౌరులకు మాత్రమే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ ఆప్షన్ వర్తిస్తుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో పలు రాష్ర్టాల్లో ఇంటింటి సర్వే ప్రారంభం కాబోతున్నదని, జనాభా లెక్కల సమయంలో సేకరించే పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యమైందని, ఆర్టీఐ కింద గానీ, కోర్టుల ముందు సాక్ష్యంగా గానీ, మరే ఇతర సంస్థతోనూ పంచుకోరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే జనాభా లెక్కల గృహాల జాబితా, గృహ గణన సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ జనాభా గణన సంబంధిత సందేహాలు, స్వీయ గణనకు సంబంధించిన ప్రశ్నలు సహా అనేక రకాల అంశాలను ఎఫ్ఏక్యూలు ప్రస్తావించాయి. అదనంగా, ఇంటి ఫ్లోరింగ్, రూఫ్‌లో ఉపయోగించే పదార్థాలు, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, కుటుంబ పెద్ద లింగం, వినియోగించే ధాన్యాల రకాలు, ప్రాథమిక, ఆధునిక సౌకర్యాల లభ్యత, సొంతంగా కలిగి ఉన్న వాహనాల రకాలకు సంబంధించిన ప్రశ్నలకు వివరణలను పోర్టల్ అందచేస్తుంది.
జనగణన మొదటి దశలో ఎన్యూమరేటర్లు ఇంటి నంబర్(మున్సిపల్, స్థానిక పాలనాధికార సంస్థ లేదా సెన్సస్ నంబర్), ఇంటిలోపల ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు కోసం ప్రధానంగా ఉపయోగించిన పదార్థాల గురించి ప్రశ్నలతో ప్రారంభిస్తారు. అనంతరం ఇంటి వినియోగం, దాని పరిస్థితి, కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల సంఖ్యను ప్రశ్నిస్తారు. ఎఫ్ఏక్యూ ప్రకారం ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కుటుంబ పెద్దగా గుర్తిస్తారు. అదేవిధంగా ఇంటి యాజమాన్య హోదాకు సంబంధించి ఒక వ్యక్తి అద్దె ఇంట్లో నివసిస్తూ భారతదేశంలో వేరే చోట సొంత ఆస్తిని కలిగి ఉంటే అది వారి తల్లిదండ్రుల ఇల్లు అయినా లేదా వారు కొనుగోలు చేసిన ఇల్లు అయినా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు కాని వేరే చోట సొంత ఇల్లు ఉంది అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా గృహాల జాబితా, గృహ గణన, సెల్ఫ్-ఎన్యూమరేషన్ తేదీలను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ ఆప్షన్ ‘ఏప్రిల్ 26 నుంచి మే 10’ వరకు అందుబాటులో ఉంటుంది. జనాభా లెక్కింపునకు సంబంధించి ఇంటింటి సర్వే ‘మే 11 నుంచి జూన్ 9’ వరకు నిర్వహిస్తారు. వలసలు, సంతానోత్పత్తి, వృత్తి, విద్య సహా పౌరుల సామాజిక-ఆర్థిక వివరాలను సేకరిస్తారు.
నా జీవిత భాగస్వామి తాత్కాలికంగా దూరంగా ఉన్నారు. మమ్మల్ని ఇప్పటికీ దంపతులుగా పరిగణిస్తారా? సహజీవనం చేస్తున్న జంటను వివాహిత జంటగా పరిగణిస్తారా? 16వ జనగణనకు ముందు ప్రభుత్వం ప్రచురించిన తరచుగా అడిగే ప్రశ్నలు(ఎఫ్ఏక్యూలు)లో చేర్చిన కొన్ని ప్రశ్నలు ఇవి. జనగణన ప్రక్రియ సమయంలో ప్రజలు ప్రశ్నలకు సులభంగా జవాబులు ఇవ్వడానికి వీలుగా ఎఫ్ఏక్యూలను స్వీయ గణన పోర్టల్‌లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. స్వీయ గణనను ఎంచుకునే వారి కోసం పోర్టల్ జనాభా లెక్కల గృహాల జాబితా, గృహ గణన(హెచ్ఎల్ఓ), అలాగే జనాభా గణన జరిగినంత కాలం అందుబాటులో ఉంటుంది. ఎఫ్ఏక్యూల ప్రకారం సహజీవనం చేసే జంట తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావిస్తే జనాభా లెక్కల కోసం వారిని వివాహిత జంటగా పరిగణిస్తారు.