జైపూర్, ఆగస్టు 30: కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు. దానిని నిజం చేస్తూ 14 నెలల క్రితం కిడ్నాపైన పిల్లవాడు కిడ్నాపర్‌ను వదిలి కన్న తల్లి వెంట వెళ్లనంటూ ప్రతిఘటించిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సస్పెండైన తనుజ్ చాహర్ గత ఏడాది జూన్‌లో 11 నెలల పిల్లాడిని కిడ్నాప్ చేసి ఇంటికి తెచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి రెండేళ్లు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పిల్లాడిని తల్లికి అప్పగించేందుకు ప్రయత్నించారు.
అయితే ఆ బాలుడు తనుజే తన తండ్రి అనుకుని అతడిని వదిలి రావడానికి నిరాకరిస్తూ గట్టిగా పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఉద్వేగంతో తనుజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పిల్లాడితో పాటు అతని కన్నతల్లిని తన వద్దే ఉండమని కోరాడు. దానికి ఆమె తిరస్కరించింది. కాగా, పిల్లాడిని అపహరించుకు వచ్చిన తర్వాత పోలీసులకు దొరక్కుండా తనుజ్ సాధువుగా వేషం మార్చుకుని యమునా నది ప్రాంతంలోని బృందావన్ పరిక్రమ్ మార్గ్ సమీపంలో నివసిస్తున్నాడు.