Body Temperature | న్యూఢిల్లీ: వయోజనుల శరీర ఉష్ణోగ్రత పెరిగితే, వారి గుండె గోడలకు రక్త ప్రవాహం పెరుగుతుందని, ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. గుండెపై ఒత్తిడిని నిరోధించేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని తెలిసింది. ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.
20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరి శరీర ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచి, పరిస్థితులను పరిశీలించారు. సీఏడీతో బాధపడుతున్న ఏడుగురి రక్త నాళాలు బంధింపబడటం వల్ల గుండెకు రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడినట్లు వెల్లడైంది. అయినప్పటికీ వీరిలో అలాంటి లక్షణాలు కనిపించలేదు.
గుండెకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని కరోనరీ ఆర్టెరీస్ సరఫరా చేస్తాయి. ఈ కరోనరీ ఆర్టెరీస్ను కుంచించుకుపోయేలా కానీ, అడ్డంకులు ఏర్పడేలా కానీ చేసేదే సీఏడీ వ్యాధి. ఈ నాళాల్లో కొలెస్ట్రాల్ సహా పాచిని పేరుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండె కండరాలకు రక్త ప్రవాహం పరిమితమవుతుంది.