న్యూఢిల్లీ, జూలై 13: దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్తెసరు మెజారిటీతో మూడోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీకి కొద్ది రోజుల్లోనే మరోసారి భంగపాటు కలిగింది. మొత్తం 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. దీంతో బీజేపీపై దేశ ప్రజలకున్న వ్యతిరేకత మరోసారి ప్రస్ఫుటమైంది. చాలా స్థానాల్లో కనీస పోటీ ఇవ్వలేక ఆ పార్టీ చతికిలపడింది.
బెంగాల్లో అధికార టీఎంసీ నాలుగింటికి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర సీఎం సుఖు భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థిపై 9,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాలాగత్లో కాంగ్రెస్, హమీర్‌పూర్‌లో బీజేపీ నెగ్గాయి. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కర్ణాటకలోని మంగళూరు స్థానాలు రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌ను అధికార ఆప్, బీహార్‌లోని రూపౌలిలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత యూపీ బీజేపీ నేతలు తమ సొంత పార్టీపై తిరుగుబాటు చేశారని, అందులో చాలామంది నేతలు పీపుల్స్ డెమోక్రాటిక్ అలయెన్స్ (పీడీఏ)లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం యూపీ బీజేపీ ఒక విధమైన నిరాశ, నిస్పృహలతో నిండి ఉందని, వారికి అలాంటి పరిస్థితి ఏర్పడటానికి పీడీయే కూటమే కారణమని అన్నారు. దాంతో ఆ పార్టీ నేతలు బయటకు రావాలని అనుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తుండగా, మరికొందరు పార్టీ వేదికలపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ 2027 ఎన్నికల్లోనే కాదు, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.