పాట్నా, జూలై 5: 2 వారాల వ్యవధిలో 12 వంతెనలు కూలిన ఘటనలకు సంబంధించి బీహార్ ప్రభుత్వం శుక్రవారం 15 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. వారు వంతెనల నిర్వహణకు సరైన చర్యలు తీసుకోలేదని రాష్ట్ర జల వనరుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్య ప్రసాద్ ఆరోపించారు. ఈ ఘటనల వెనుక కాంట్రాక్టర్ల అశ్రద్ధను ఆయన ఎత్తి చూపారు. మరోవైపు కూలిన బ్రిడ్జి ల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పుణె పోర్షే కారు కేసు.. రోడ్డు భద్రతపై వ్యాసం సమర్పించిన బాలుడు
పుణె, జూలై 5: పుణె పోర్షే కారు కేసులో నిందితుడైన 17 ఏండ్ల బాలుడు జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) బెయిల్ నిబంధనలకు అనుగుణంగా రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసాన్ని సమర్పించినట్టు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. కాగా, ఈ కేసులో అతడిని రిమాండ్కు పంపడం జువైనల్ చట్టం ప్రకారం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొనడంతో గత నెలలో అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేశారు. మే 19న పుణెలో ఈ బాలుడు మద్యం మత్తులో అర్ధరాత్రి తన లగ్జరీ పోర్షే కారుతో ఢీకొనడంతో ఇద్దరు యువ టెకీలు మరణించారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే అతడిని జేజేబీ విడిచిపెట్టడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై రివ్యూ పిటిషన్ల విచారణ 10న
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపును తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 10న విచారణ జరుపుతుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వీటిని పరిశీలిస్తుంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరు 17న తీర్పు చెప్పింది. దీనిపై నిర్ణయాధికారం పార్లమెంటుదేనని పేర్కొన్నది.