న్యూఢిల్లీ, మే 30: లోక్‌సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచార పర్వానికి గురువారంతో తెరపడింది. మూడు నెలలుగా ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలకు విశ్రాంతి లభించింది. హోరెత్తిన మైకులు మూగబోయాయి. జూన్ 1న జరగనున్న ఏడో, చివరి విడత ఎన్నికలకు గురువారం సాయంత్రంతో ప్రచార గడువు పూర్తయ్యింది. ఇవి చివరి విడత ఎన్నికలు కావడంతో మొత్తం ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి విడతలో భాగంగా 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. పంజాబ్‌లో 13 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది, బీహార్‌లో ఎనిమిది, ఒడిశాలో ఆరు, జార్ఖండ్‌లో మూడు సీట్లతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా, ఇప్పటివరకు 28 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది.
లోక్‌సభ ఆఖరి విడత ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. ఇక్కడి వివేకానంద రాక్ మెమోరియల్‌లో 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని ప్రారంభించారు. మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన అక్కడే ధ్యానంలో గడుపుతారు.
మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ మధురైలో తంతై పెరియార్ ద్రవిడర్ ఖజగం పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సైతం గో బ్యాక్ మోదీ హ్యాష్‌టాగ్‌తో పోస్టులు వెల్లువెత్తాయి. జూన్ 1న ఆఖరి విడత ఎన్నికలు జరగనుండగా, మోదీ ధ్యాన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుండటం పట్ల విపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కాగా, ఇది మోదీ వ్యక్తిగత పర్యటన అని, ఇందులో పార్టీ వర్గాలు పాలుపంచుకోవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు.