అలహాబాద్: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు అనుకూలమైన తీర్పులు వెలువరించాలంటూ న్యాయమూర్తులపై ప్రత్యేకంగా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ల(సీజేఎం)పై పోలీసు అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడం సర్వసాధారణంగా మారిపోయిందని హైకోర్టు మండిపడింది. ఉత్తరప్రదేశ్‌ని పోలీసు రాష్ట్రంగా మార్చడానికి న్యాయస్థానం అనుమతించబోదని జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ విచారణ సందర్భంగా హెచ్చరించారు.
నిందితుల కాళ్లపై కాల్పులు జరిపే పోకడ ఎందుకు పెరిగిపోతోందో వివరించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ, అదనపు చీఫ్ సెక్రటరీ(హోం) సంజయ్ ప్రసాద్ వర్చువల్‌గా విచారణకు హాజరైన సందర్భంగా న్యాయమూర్తి దేశ్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూలమైన తీర్పుల కోసం పోలీసు అధికారులు ముఖ్యంగా యువ అధికారులు న్యాయాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది చాలా ఆందోళనకరమైన పోకడని న్యాయమూర్తి తెలిపారు.
ఒక సందర్భంలో ఈ వివాదాన్ని ఆపడానికి ఓ సీజేఎంనే బదిలీ చేయాల్సి వచ్చిందని న్యాయమూర్తి వెల్లడించారు. ఇది కేవలం ఓ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదని, అన్ని జిల్లాల్లో తమకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ న్యాయాధికారులపై ఐపీఎస్ సహా పోలీసు అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంటున్నదని జస్టిస్ దేశ్వాల్ తెలిపారు. పోలీసు అధికారులు తమను తాము న్యాయమూర్తుల కన్నా అధికులమని భావించకూడదని ఆయన హితవు చెప్పారు.