అహ్మదాబాద్, జూన్ 13: భారత్‌లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త.. కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు.. పెండ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకొంటున్న యువతి.. భర్త పుట్టిన రోజును కలిసి జరుపుకోవాలని ఆశపడ్డ భార్య..
కల నెరవేరిందన్న ఆనందంలో ఎయిర్‌హోస్టెస్.. సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ.. లండన్‌కు వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకొన్న సిస్టర్స్.. గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో అసువులుబాసిన ఒక్కొక్కరి కన్నీటి కథలివి!
తన కల నెరవేరందని సంతోషపడే లోపునే క్రూ మెంబర్ మైథిలీ పాటిల్ (22) ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించింది. నవీ ముంబయి కి చెందిన ఆమె చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని కలలు కనేది. ఆమె కలలు నిజమై ఆమె ఎయిరిండియా సిబ్బందిలో భాగమైంది. గు రువారం విధి నిర్వహణలో ఉండగానే ఆమె ప్రమాదంలో కన్నుమూసింది.
ఇంఫాల్: విమాన ప్రమాద మృతుల్లో మణిపూర్ తౌబల్ పట్టణానికి చెందిన 21 ఏండ్ల ఫ్లయిట్ అడెంటెండ్ న్గంతోయ్ శర్మ ఉందని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొద్ది గంటల ముందే తమతో మాట్లాడిన ఆమె ఇక బతికి లేదన్న విషయం తెలిసి శోక సంద్రంలో మునిగిపోయారు. న్గంతో య్ శర్మ గురువారం 11.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తాను లండన్‌కు డ్యూటీపై వెళ్తున్నానని, కొద్ది రోజుల పాటు ఫోన్‌కు అం దుబాటులో ఉండనని, అక్కడి నుంచి జూన్ 15 తర్వాతే వస్తానని, అప్పుడే అందుబాటులో ఉంటానని తెలిపింది. అదే ఆమె ఆఖరి కాల్. మూడు గంటల తర్వాత ఆమె విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో తెలుసుకుని కుటుంబం కుప్పకూలిపోయింది. కాలేజీలో చదువుతుండగానే 19 ఏండ్లకే ఎయిర్ ఇండియాలో శర్మకు ఉద్యోగం వచ్చిందని, ముంబైలో స్నేహితులతో హాస్టల్లో ఉంటున్నదని ఆమె కుటుం బ సభ్యులు తెలిపారు.
పెళ్లయిన రెండు రోజులకే నవ వరుడిని విమాన ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లండన్‌లోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్న భవిక్ మహేశ్వరి (26) సెలవులపై రెండు వారాల క్రితం వడోదర వచ్చాడు. భవిక్‌కు ఈ నెల 10న రిజిస్ట్రార్ వివాహం జరిపించారు. ఈసారి భారత్ వచ్చినప్పుడు వివాహ ఫంక్షన్ చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సెలవులు అయిపోవడంతో లండన్‌కు గురువారం బయలుదేరిన భవిక్‌కు ఆయన భార్య కూడా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె ఇంటికి చేరకముందే పెను విషాద వార్త చేరడంతో కుప్పకూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు తన కుమారుడు ఆఖరిసారి తనతో మాట్లాడాడని ఆయన తండ్రి అర్జున్ మహేశ్వరి తెలిపారు.
ఆగ్రా: నీరజ్ లవానియా (50), ఆయన సతీమణి అపర్ణ (49)లకు కొత్త ప్రదేశాలను సందర్శించడమంటే చాలా ఇష్టం. వేసవిలో వారు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటుకు వెళ్లి, ఆనందంగా గడుపుతారు. ఈసారి వీరిద్దరూ లండన్‌లో సరదాగా సేద తీరాలనుకున్నారు. అయితే, విధి వారిద్దరినీ కబళించింది. గురువారం జరిగిన ఏఐ-171 విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో ఈ దంపతులు కూడా ఉన్నారు. వీరి కుమార్తె (18) చదువుకుంటున్నారు. ఆమె కూడా తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లవలసి ఉంది. కానీ ఆమె 70 ఏళ్ల వృద్ధురాలైన బామ్మ బాగోగులు చూడటం కోసం ఆమెతో కలిసి ఇంటి వద్దనే ఉండిపోయారు. దీంతో భయానక ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే నీరజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. ఆయన 1995లో గుజరాత్‌లోని వడోదరకు వలస వెళ్లారు.ఈ దంపతుల మరణవార్త అందరినీ కలచివేస్తున్నది.
యూపీలోని ఆగ్రాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య 50వ పుట్టిన రోజును లండన్‌లో జరుపుకోవాలని లండన్ బయలుదేరాడు. కొద్దిసేపటికీ మృత్యుఒడికి చేరుకున్నారు.
అహ్మదాబాద్: యూకేలో కొత్తగా ఇంటిని కొనుక్కున్న కుమారుడి గృహ ప్రవేశానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వృద్ధ దంపతుల ఆనందాన్ని అహ్మదాబాద్ విమాన ప్రమాదం చిదిమేసింది. పినాకిన్ షా (62), అతని భార్య రూపాబెన్ (58) అహ్మదాబాద్‌లో నివసిస్తున్నారు. వారి కుమారుడు రుషబ్ స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇంటిని కొనుక్కుని గృహప్రవేశానికి ఆహ్వానించాడు. దాని కోసం వారు గురువారం విమానంలో వెళ్తుండగామరణించారు.
ఎయిర్ ఇండియాకు విమానం దుర్ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయినప్పటికీ హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత చెక్కు చెదరని స్థితిలో లభించింది.
అహ్మదాబాద్: ఆకాశంలో విహరించాల్సిన విమానం చెట్టుకింద పడుకున్న బాలుడి ప్రాణం తీయడమేంటి? విధి అంటే ఇదో కాబోలు అన్పిస్తుంది ఈ ఘటన గురించి తెలుసుకున్న వారికెవరికైనా. గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అహ్మదాబాద్ మేఘానినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం సమీపంలో తన తల్లిదండ్రుల టీ స్టాల్‌కు సమీపంలోని ఒక చెట్టుకింద నిద్రిస్తున్న 14 ఏండ్ల ఆకాశ్ పాట్నీని విమాన శకలం పొట్టనపెట్టుకుంది.
ఈ టీస్టాల్ విమానం ఢీకొన్న హాస్టల్ భవనానికి ఆనుకుని ఉంది. ఆ సమయంలో అతడి తల్లి టీ తయారు చేస్తుండగా, అతను అక్కడే ఉన్న చెట్టుకింద పడుకుని ఉన్నాడు. హఠాత్తుగా ఒక భారీ విమాన శకలం అతని తలపై పడింది. వెంటనే అతను మంటల్లో చిక్కుకున్నాడు. అతడిని రక్షించడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. అతని మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మాడిపోవడంతో మృతదేహాన్ని గుర్తించేందుకు సివిల్ దవాఖాన అధికారులు ఆకాశ్ తండ్రి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారు.