Supreme Court | ఓ కేసులు నిందితుడికి బెయిల్‌ను మంజూరు చేసినప్పటికీ.. అతన్ని విడుదల చేయనందుకు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి రూ.5లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పిటిషనర్ అఫ్తాబ్‌కు తాత్కాలికంగా పరిహారంగా ఇవ్వనున్నారు. అఫ్తాబ్ కేవలం సాంకేతిక కారణాలతో బెయిల్ బాండ్‌ను సమర్పించినా 28 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. స్వేచ్ఛ అనేది విలువైన హక్కు అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. జరిమానా ఉత్తర్వులపై సమ్మతి నివేదికను జూన్ 27న సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎంత మంది జైళ్లలో మగ్గిపోతున్నారో దేవుడికే తెలుసునని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ కూడిన ధర్మాసనం పేర్కొంది. స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని.. సాంకేతిక కారణాలు చూపుతూ జైలులో బంధించినందుకు జైలు పరిపాలన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని.. నిందితుల విడుదల జాప్యానికి కారణాన్ని గుర్తించాలని ఘజియాబాద్ జిల్లా సెషన్స్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఘజియాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్, జైళ్ల డైరెక్టర్ జనరల్ పీసీ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. బెయిల్ ఆర్డర్ నుంచి నేరాల వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు.. పనికిరాని సాంకేతిక, అసంబద్ధమైన లోపాల ఆధారంగా విడుదలను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఇలాగే మరికొందరు జైలులో లేరని హామీ ఏంటీ? కోర్టు ఉత్తర్వులను ఇచ్చిందని.. సరైన సెక్షన్‌ను ఆర్డర్లో ప్రస్తావించారని.. ఒర సెక్షన్లో పలు ఉప విభాగాలుంటాయని.. ఇవన్నీ మీ అనుభవంలో సరైన అభ్యంతరాలా? అంటూ జైళ్ల డైరెక్టర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలను నివారించేందుకు జైలు అధికారులను సెన్సిటైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన ధర్మాసనానికి హామీ ఇచ్చారు.