న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను భారత సైనిక దళాలు ధ్వంసం చేశాయి. సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి.
1. ముదస్సర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్. లష్కరే తోయిబాతో సంబంధమున్న ఉగ్రవాది. మురిద్కేలోని మర్కజ్ తైబా ఇన్చార్జ్. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ శిబిరంలోనే శిక్షణ పొందినట్లు ఒప్పుకున్నాడు. 26/11 దాడుల్లో పాల్గొన్న మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే శిక్షణ పొందినట్లు సమాచారం.
కాగా, పాకిస్థాన్‌లోని ప్రభుత్వ స్కూల్లో గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వంలో ముదస్సర్ అంత్యక్రియలు జరిగాయి. పాకిస్థాన్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ తరపున ఉన్నత సైనిక అధికారులు పుష్పగుచ్ఛం ఉంచారు. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ అధికారి, పంజాబ్ ప్రావిన్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ తదితరులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
2. హఫీజ్ ముహమ్మద్ జమీల్, జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం)తో సంబంధం ఉన్న టాప్ ఉగ్రవాది. జెఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ బావమరిది. పాకిస్తాన్‌లోని బహవల్పూర్లో మర్కజ్ సుభాన్ అల్లాహ్ ఇన్చార్జ్. జేఈఎంవైపు యువతను ప్రేరేపించడం, నిధుల సేకరణలో చురుకుగా పాల్గొన్నాడు.
కాగా, జేఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ తరచుగా బహవల్పూర్ను సందర్శించేవాడు. మే 7న ఇక్కడి ఉగ్రవాద శిబిరంపై జరిగిన దాడిలో అజార్ కుటుంబ సభ్యులు, నలుగురు అనుచరులతో సహా పది మంది మరణించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
3. మహ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ మొహమ్మద్ సలీం. ఇతడు కూడా జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం)లో టాప్ ఉగ్రవాది. మసూద్ అజార్ బావమరిది. జేఈఎంలో ఆయుధ శిక్షణ నిర్వహించాడు. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాద దాడులతోపాటు 1999లో ఐసీ-814 విమానం హైజాక్‌లో (కాందహార్ హైజాకింగ్)లో పాల్గొన్నాడు. విమాన ప్రయాణికుల బందీలకు బదులుగా మసూద్ అజార్‌ను భారత్ నాడు విడుదల చేసింది.
4. అబూ అకాషా అలియాస్ ఖలీద్ అలియాస్ అబూ అకాషా. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. ఎల్ఈటీ కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైసలాబాద్‌లో జరిగిన అబూ అకాషా అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ సీనియర్ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.
5. మహ్మద్ హసన్ ఖాన్, నిషేధిత జైషే గ్రూపునకు చెందిన టాప్ ఉగ్రవాది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జేఈఎం ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఈ ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ ఉన్నత సైనిక అధికారుల హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధాన్ని ఇది బహిర్గతం చేసింది.