న్యూఢిల్లీ, నవంబర్ 14: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన దరిమిలా రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే అటువంటి సాహసానికి బీజేపీ ఒడిగట్టకపోవచ్చని జేడీయూకు చెందిన వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలకే పరిమితమై సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ, 16 సీట్లు సాధించిన టీడీపీ ఆసరాతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
బీహార్‌లో సీఎం స్థానం నుంచి తప్పిస్తే తక్షణమే కేంద్రంలో జేడీయూ తన మద్దతును ఉపసంహరించుకోవడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, బీజేపీ కూడా అంతటి సాహసాన్ని తలపెట్టకపోవచ్చని, నితీశ్‌ని కొనసాగించడం మినహా ఆ పార్టీకి వేరే గత్యంతరం లేదని వారు అంటున్నారు.