న్యూఢిల్లీ, ఆగస్టు 2: నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్-యూజీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను జూలై 23న సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కారణాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తాజాగా వివరించింది. ఈ ఏడాదిలా ఒక నిర్ణయం తీసుకోవడం, దానిని మళ్లీ మార్చుకునే పద్ధతిని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) ఆపేయాలని, ఇది విద్యార్థులకు మేలు చేయదని పేర్కొన్నది. ఎన్టీఏ పనితీరును మెరుగుపరిచేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో నియమించిన నిపుణుల కమిటీకి కోర్టు పలు సూచనలు చేసింది. పరీక్ష వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సెప్టెంబరు 30 నాటికి నివేదిక సమర్పించాలని పేర్కొన్నది. పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడానికి గానూ అధునాతన సాంకేతికతను వినియోగించడానికి సంబంధించి ప్రామాణికంగా ఉండేలా ఒక విధానాన్ని రూపొందించాలని సూచించింది.