న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి ఓ ‘ఫార్ములా’ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరెస్సెస్, పార్టీ ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ‘ఫార్ముల’ను ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ సహా ఇతర భాగస్వామ్య పార్టీలకు ఆయన పంపారట. ప్రతి 5 మంది ఎంపీలకు ఒక క్యాబినెట్ బెర్త్, రెండు ఎంపీలున్న మిత్ర పక్షానికి సహాయ మంత్రి పదవిని కేటాయించేందుకు నిర్ణయించినట్టు సమాచారం.
న్యూఢిల్లీలో జేపీ నడ్డా ఇంట్లో ఏర్పాటుచేసిన సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, మాండవీయ, పార్టీ జనరల్ సెక్రెటరీలు, ఆరెస్సెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు.16 మంది ఎంపీలున్న టీడీపీకి మూడు క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు, 12 మంది ఎంపీలున్న జేడీయూకు రెండు క్యాబినెట్ బెర్త్‌లు, మరో రెండు సహాయ మంత్రి పదవులు రానున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నాయి.
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): లోక్‌సభ స్పీకర్, ఎన్డీయే కన్వీనర్ పదవులను టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నారని తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్‌ల పేర్లను స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
ఎన్డీయే సర్కార్‌లో జేడీయూకి మూడు క్యాబినెట్ బెర్త్‌లు దక్కనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. కీలకమైన రైల్వే,గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జల వనరులు, భారీ పరిశ్రమల శాఖల మంత్రి పదవులు తాము ఆశిస్తున్నట్టు జేడీయూ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.