ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలో వివిధ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ యూజీ పేపర్ లీకేజీ ఉదంతాన్ని మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని మరోమారు ఎత్తిచూపుతోంది. ఈ లీకేజీల అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జూన్ 28 (ఆదివారం) జరగాల్సిన ‘టెట్’ పరీక్షకు 20 గంటల ముందే ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని తేలడంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆప్ ఎగ్జామినేషన్(ఎంఎస్‌సీఈ) ఈ పరీక్షను వాయిదా వేసింది. థానేలో అసలు ప్రశ్న పత్రాన్ని పోలిన కొన్ని ప్రశ్నలు కలిగిన ఎగ్జామ్ పేపర్ లభ్యం కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కాగా ‘నీట్’ పేపర్ లీకేజీ మూలాలు నాసిక్‌లోనే ఉన్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ తాజా లీకేజీపై స్పందిస్తూ ‘బీజేపీ హాయాంలో లీక్ కాని పేపర్ ఏదీ లేదు. ఈ ప్రభుత్వం కాస్తా పేపర్ లీక్ ప్రభుత్వంగా మారిపోయింది’ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టింది. కాగా ‘టెట్’ లీకేజీపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘ఈ దేశంలో పేపర్ లీక్‌తో ముగియని ప్రభుత్వ పరీక్ష ఏదైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించారు. ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మరో పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. వీరు పరీక్షలనూ వదలడం లేదు.
గుడులనూ వదలడంలేదు. అన్ని చోట్లా దోచుకుంటున్నారు’ అని తూర్పూరబట్టారు. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ గందరగోళానికి బీజేపీ ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ స్పందిస్తూ, పేపర్ లీక్‌లు ఈ విఫల ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాల్లో ఆదివారం జరగాల్సిన ‘టెట్’ పరీక్షకు 4.28 లక్షల మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. 2025లోనూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ‘టెట్’ ప్రశ్నపత్రం లీకైంది.
టెక్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను భివండీలో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వీరు ప్రశ్నపత్రం కావాల్సిన వారి నుంచి రూ.1.5 కోట్లు డిమాండ్ చేశారు. వీరి నుంచి పోలీసులు నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవి అసలైన ప్రశ్నపత్రాలేనని నిర్ధారణ అయింది. నిందితుల్లో ఒకరు హర్యానాకు చెందిన వ్యక్తి కాగా, మిగతా ఇద్దరు బీహార్‌కు చెందినవారు. ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది.