న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ‘భారత్‌లో ఓ సిక్కు టర్బన్, కడెం ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందా అనే దానిపై పోరాటం జరుగుతున్నది’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పన్నూ.. భారత్‌లో సిక్కులకు ఉన్న ముప్పుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ధైర్యంతో, మార్గదర్శకంగా చేసినట్టు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో 1947 నుంచి సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితులను చాటేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, తమ ఖలిస్థాన్ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు.
భారత వ్యతిరేకితో సమావేశమా?
అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ సమావేశం కావడం దుమారం రేపుతున్నది. తరచూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, అమెరికా చట్టసభలో భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టే ఇల్హాన్తో రాహుల్ సమావేశం కావడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. 2022 ఏప్రిల్‌లో ఆమె పీఓకేలో పర్యటించి, పాక్ నేతలతో భేటీ అయిన విషయాన్ని బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా గుర్తు చేశారు. ఆమె ఆర్టికల్ 370 రద్దును, ఎన్ఆర్సీని వ్యతిరేకించారని పేర్కొన్నారు. అనేకసార్లు భారత్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఇల్హాన్ ఒమర్‌ను రాహుల్ ఎందుకు కలవాల్సి వచ్చిందని, బీజేపీ విరోధి అయితే దేశ విరోధి అయినా కలుస్తారా అని ఆయన ప్రశ్నించారు.