న్యూఢిల్లీ, జూన్ 9: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కొంతమంది భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై దాడికి తెగబడ్డారు. ఆదివారం ఇక్కడి ఓ పుణ్యక్షేత్రం నుంచి బయల్దేరిన ఓ బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని రియాస్ జిల్లా ఎస్ఎస్సీ మోహితా శర్మ చెప్పారు. శివ్ఖోరి ఆలయం నుంచి కాత్రాకు వస్తుండగా.. తిర్యాత్ గ్రామం వద్ద సాయంత్రం 6.15 గంటలకు దాడి జరిగిందని, దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయిందని తెలిపారు. రాజౌరీ, పూంఛ్, రియాస్‌లలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల పొదలమాటున దాక్కొని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని, అయితే మృతులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారని, స్థానికుల సాయంతో గాయపడ్డవారిని దవాఖానలకు తరలించామని తెలిపారు.
ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష
యాత్రికుల దాడి నేపథ్యంలో ఘటనాస్థలంలోని పరిస్థితిపై ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాతో సమీక్ష నిర్వహించారు. అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, బాధితులకు సాయం చేయాలని ఎల్జీని ఆదేశించారు. ఘటనపై తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.