శ్రీనగర్: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. (Terrorist attack on army vehicle) అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సుందర్బని మల్లా రోడ్డు వద్ద ఫాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సుమారు రెండు రౌండ్లు ఫైరింగ్ జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు.
కాగా, సరిహద్దు సమీపంలోని ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు సాధారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వాహనంపై కాల్పుల సంఘటన నేపథ్యంలో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ జరుగుతున్నదని వెల్లడించారు.
మరోవైపు పంజాబ్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ చొరబాటుదారుడ్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్ చొరబాటుదారుడ్ని గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు అతడ్ని వారించాయని, అయినప్పటికీ చొరబాటుకు యత్నించగా కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.