న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ (సైనిక రిజర్వు దళం)ని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సైన్యాధ్యక్షుడి అధికారాలను విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ప్రతి అధికారి, నమోదు చేసుకున్న సిబ్బందిని అవసరమైతే గార్డు విధులు లేదా రెగ్యులర్ ఆర్మీకి మద్దతుగా పూర్తిస్థాయి సేవల కోసం పిలిపించుకునేందుకు సైన్యాధ్యక్షుడికి అధికారం ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న 32 టెరిటోరియల్ ఆర్మీ పదాతిదళ బెటాలియన్లలో 14 బెటాలియన్లను భారత సైన్యంలోని ప్రధాన కమాండ్లు అయిన దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య, ఉత్తర, దక్షిణ పశ్చిమ, అండమాన్ నికోబార్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్టీఆర్ఏసీ) సహా మోహరించేందుకు ప్రత్యేక ఆమోదం లభించింది. ఈ ఉత్తర్వు 2025 ఫిబ్రవరి 10న ప్రారంభమై 2028 ఫిబ్రవరి 9 వరకు మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీనే సైనిక రిజర్వు దళం అని కూడా పిలుస్తారు.
దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్మీకి మద్దతుగా ఈ దళం సిద్ధంగా ఉంటుంది. వీరు బయట ఉద్యోగాలు చేసుకుంటూనే సైన్యంలో స్వచ్ఛందం గా సేవలు అందిస్తారు. ఈ టెరిటోరియల్ ఆర్మీలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వంటి ప్రముఖులు గౌరవ హోదాలో ఉన్నారు.