న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: తమ వద్ద చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్, ఈ-వీసాలు ఉన్నప్పటికీ తనతో పాటు 56 మంది భారతీయుల పట్ల జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఒక మహిళ ఇన్‌స్టాలో ఆరోపించింది. ఆర్మేనియా సడఖ్లో సరిహద్దు నుంచి జార్జియాలోకి తమ బృందం ప్రవేశిస్తుండగా, తమను సరిహద్దు వద్ద నిలిపివేశారని తెలిపింది. అక్కడ తమను ఐదు గంటల పాటు చలిలోనే ఉంచేశారని, ఎలాంటి ఆహారం ఇవ్వలేదని, కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లనీయలేదని ఆమె వాపోయారు. అధికారులు రెండు గంటల పాటు తమ పాస్‌పోర్టులు తమ వద్ద ఉంచుకున్నారని, తాము అడిగినా ఎలాంటి సమాచారం తెలపలేదని చెప్పారు. తమను పశువుల్లా బలవంతంగా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారని, తామేదో నేరస్థులమైనట్టు తమ వీడియోలు తీశారని, తాము వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారని ఆరోపించారు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే తమ వీసాలు తప్పుడువని పేర్కొన్నారని, తమ పట్ల జార్జియా అధికారులు ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు, ఎంతమాత్రం ఆమోదనీయం కాదు అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దానిని ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ట్యాగ్ చేశారు. జార్జియా అధికారులు తమ పట్ల అవమానకరంగా, దురుసుగా ప్రవర్తించారని మరికొందరు ఆరోపించారు.