మార్చి 23 నుంచి అమలు
న్యూఢిల్లీ, మార్చి 21: దేశీయ విమాన చార్జీలపై విధించిన తాత్కాలిక పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది ఈ నెల 23 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. నిరుడు డిసెంబర్లో ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వం విధించిన ఈ పరిమితులను తొలగించనున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కాగా, పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాల దృష్ట్యా కూడా వీటిని ఎత్తివేసినట్టు తెలుస్తున్నది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ తాత్కాలిక పరిమితులను అమలు చేసినట్టు ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కాగా, ఇండిగో సంక్షోభం ఏర్పడినప్పుడు విమాన టికెట్ల రేట్లు ఆకాశాన్నంటిన క్రమంలో కేంద్రం డిసెంబర్ 6 నుంచి ఈ తాత్కాలిక పరిమితులను అమలు చేస్తున్నది.
60% ఉచిత సీట్లకు ఒప్పుకోం! ; తెగేసి చెప్పిన విమానయాన సంస్థలు
న్యూఢిల్లీ: విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను విమానయాన సంస్థ లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) పౌర విమానయాన కార్యదర్శి సమీర్ సిన్హాకు లేఖ రాస్తూ తాజా నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ంది. డీజీసీఏ విధించిన ఈ నిబంధనలు ఎయిర్‌లైన్స్‌ల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఫలితంగా ఏర్పడే నష్టాలను టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి పూడ్చుకునేలా ఒత్తిడి తెస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా వాణిజ్య నిర్ణయాలపై నియంత్రణ సంస్థల పాత్రపై కూడా ప్రశ్నించింది. చార్జీలు, సీట్ల కేటాయింపు లాంటివి పూర్తిగా వ్యాపార నిర్ణయాలని, అందులో విమానయాన నియంత్రణ సంస్థకు జోక్యం చేసుకునే అధికారం లేదని పేర్కొంది.