Karnataka Elections | జహీరాబాద్, ఏప్రిల్ 13: కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఆనాడు నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్కర్ణాటక (హైకా) ప్రాంతాల్లోని బీదర్, గుల్బర్గా (కలబురిగి), రాయచూర్, యాదగిరి, బళ్లారి, విజయనగర కొప్పల్ జిల్లాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివాసముంటున్నారు. ఈ జిల్లాల్లో దాదాపు 10 నుంచి 20 శాతం వరకు తెలుగు ఓటర్లు ఉన్నారు.
బీదర్ జిల్లాలో ఉన్న తెలుగువారిలో అత్యధికులు సంగారెడ్డి జిల్లావాసులే. ఈ జిల్లాలో ఆరు స్థానాల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. గుల్బర్గా జిల్లాలో చిత్తాపూర్, సేడం, గుల్బర్గా రూరల్, గుల్బర్గా నియోజకవర్గాల్లో తెలుగువారి ఓట్లు పార్టీల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. బీదర్ జిల్లాలో తెలుగు ప్రజలు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ నేతలను ప్రచారానికి దింపేందుకు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.