న్యూఢిల్లీ: ‘టెలిగ్రామ్’ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యురోవ్ (41) 37 ఏళ్ల లోపు వయసు గల మహిళలకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన వీర్యంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ తీసుకునేందుకు అంగీకరించే మహిళలకు పూర్తి ఖర్చులు తానే భరిస్తానని తెలిపారు. తనకు ముగ్గురు మహిళలతో నేరుగా గల సంబంధాల వల్ల ఆరుగురు సంతానం ఉన్నారని, వీర్య దానం ద్వారా 100 మందికిపైగా పిల్లలకు తండ్రినయ్యానని తెలిపారు.
తన జీవ సంబంధ పిల్లలందరూ తన ఆస్తిలో సమాన వాటాలు పొందుతారని చెప్పారు. వారు ఏవిధంగా జన్మించారనే దానితో సంబంధం లేదన్నారు. డ్యురోవ్ రష్యాలో జన్మించారు. ఆయన 2013లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రారంభించారు. ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు, పోస్ట్‌లను చూసినపుడు, ప్రపంచంలో పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నదని, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నదని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీర్య దానం చేయడం సామాజిక బాధ్యతగా ఆయన అభివర్ణిస్తున్నారు. డ్యురోవ్ వీర్యం మాస్కోలోని ఫెర్టిలిటీ క్లినిక్‌లో అందుబాటులో ఉన్నది. దీనిని గతంలోనే ఆయన దానం చేసి, ఇక్కడ భద్రపరిచారు.