సివిల్ సర్వీసులకు ఎంపిక కావాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో అడుగుపెట్టిన ముగ్గురు వరదలకు బలయ్యారు. లైబ్రరీలో చదువుకుంటూనే ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరదనీరు ముంచెత్తడంతో ఇద్దరు యువతులు, ఒక యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మృతుల్లో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఢిల్లీలో సివిల్స్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భగ్గుమన్నారు. కోచింగ్ సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు.
IAS Study Circle | న్యూఢిల్లీ, జూలై 28: సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు అభ్యర్థులు వరదనీటిలో మునిగి మరణించారు. కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటుండగా ఉప్పెనలా ముంచెత్తిన వరద ఓ తెలంగాణ యువతితో పాటు మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
ఈ ఘటనకు స్టడీ సర్కిల్ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే కారణమని ఆరోపిస్తున్న వివిధ కోచింగ్ సెంటర్లకు చెందిన విద్యార్థులు ఘటన జరిగిన రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో స్టోర్‌రూమ్, పార్కింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది. కానీ అందులో లైబ్రరీ నిర్వహిస్తు న్నారు. స్టడీ సర్కిల్ యాజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ మంత్రి ఆతిశీ తెలిపారు.
మృతుల్లో ఒకరైన తాన్యా సోనిది మంచిర్యాల జిల్లా నస్పూర్. వీరి స్వస్థలం బీహార్. తాన్యా తండ్రి విజయ్‌కుమార్.. సీసీసీ నస్పూర్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసముంటూ శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్ఆర్పీ-1 గని మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చదువులో చురుగ్గా ఉండే తాన్యాను డిగ్రీ పూర్తయిన వెంటనే సివిల్ సర్వీస్ చదివించడానికి ఢిల్లీకి పంపించారు. కాగా, తాన్యా కుటుంబం ఆమె చెల్లిని లక్నోలోని కళాశాలలో దించడానికి శనివారం సాయంత్రమే బయలుదేరింది. రైలులో నాగ్‌పూర్ వద్ద ఉండగా విజయ్‌కుమార్‌కు కూతురు మరణవార్త తెలిసింది. తాన్యా సోని మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.