న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: నవకల్పనల్లో నవ రాష్ట్రం తెలంగాణ జెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఏర్పడి తొమ్మిదేండ్లే అయినా, పరిశ్రమల్లో కొత్త విధానాలు అమలుచేయటంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నది. దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనే పరిశ్రమల్లో ఉత్పత్తి, మార్కెటింగ్, సాంకేతికత వంటి రంగాల్లో కొత్త విధానాలను అమలు చేస్తున్నారని నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే- 2021-22లో తేలింది. ఈ సర్వే నిర్వహించింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సర్వే నిర్వహించింది.
గుజరాత్ మాడల్ అంటూ ప్రధాని మోదీ, బీజేపీ చేసిన ప్రచారమంతా ఉత్త డొల్లేనని ఈ సర్వేతో మరోసారి స్పష్టమైంది. దేశ పారిశ్రామికరంగానికి ఊపిరి వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల పరిస్థితి ఘోరంగా ఉన్నదని సర్వేలో తేలింది. దేశంలోని ఎంఎస్ఎంఈల్లో నవకల్పన (ఇన్నోవేషన్) విధానాలపై ఈ సర్వే నిర్వహించారు. 2017-18 నుంచి 2019-20 మధ్య పరిశ్రమల్లో నవకల్పనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొనేందుకు నిర్వహించిన ఈ సర్వేల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8,074 కంపెనీలను సర్వే చేయగా, వీటిలో 25.01 శాతం మాత్రమే ఇన్నోవేషన్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పాయి. 73.76 శాతం సంస్థలు పాత విధానాలతోనే ఉత్పత్తి, వ్యాపారం నడిపిస్తున్నట్టు పేర్కొన్నాయి.
పారిశ్రామికీకరణ భారీగా ఉన్నా..
గుజరాత్, దాద్రానగర్ హవేలీ అత్యధికంగా పారిశ్రామికీకరణ చెందినప్పటికీ ఇన్నోవేషన్‌లో చాలా వెనుకబడి ఉన్నాయి. అక్కడి పరిశ్రమలు ప్రధానంగా కెమికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాలపైనే దృష్టిపెట్టాయి. వీటిలో నూతన విధానాల అమలు చాలా ప్రమాదమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకే కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపటంలేదు. చాలా సంప్రదాయబద్ధమైన వ్యవస్థీకృత విధానాలను అవలంబించటం కూడా ఇందుకు ఒక కారణం.
– నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే-2021-22