హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్‌కు రైతులంటే లెక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ విధానాల కారణంగా దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని చెప్పారు. జాతీయ రైతు ఐక్య సంఘటన్ రూపంలో మోదీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించేందుకు యూపీ నుంచి వచ్చిన సుబేసింగ్ డాగర్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉన్న రాష్ర్టాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని ప్రశంసించారు. కేసీఆర్ విజనరీ లీడర్షిప్ను దేశం కోరుకొంటున్నదని చెప్పారు. పలు అంశాల్లో ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
మోదీ కార్పొరేట్ పీఎం
దేశం ఇప్పటివరకు మోదీ లాంటి ప్రధానిని చూడలేదు. ఎనిమిదేండ్లుగా మోదీ ఈ దేశంలో ఏ రంగంవారినీ ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. కేవలం తన వ్యాపార స్నేహితులకు ప్రయోజనం కల్పించేందుకే మోదీ ప్రధాని అయ్యాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణ పౌరులంటే మోదీకి లెక్కలేదు. వారి బాగు కోసం ఏ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా సహా అనేక రాష్ర్టాల్లో వ్యవసాయరంగం ఉనికే ప్రమాదంలో పడింది. కేంద్రం అనాలోచితంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా పోరాడిన రైతుల ప్రాణాలను హరించిన వైనం ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠను దిగజార్చాయి. యూపీలో అఖిలేశ్‌యాదవ్ హయాంలో కొద్దిగా రైతులు సంతోషంగా ఉన్నారు. యోగీ విధానాల వల్ల వేలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు భూములను వదిలి పెట్టే దుస్థితి దాపురించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇది మరింత కాలం కొనసాగితే తిండి కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి రైతాంగ సమస్యలపై గళమెత్తుతున్న వారి కోసం దేశం ఎదురుచూస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాం. సమాలోచనలు చేశాం. తెలంగాణ అనేక సంక్షోభ స్థితులను విజయవంతంగా ఎదుర్కొని సంక్షేమం వైపు వేగంగా అడుగులు వేస్తున్నది.
తెలంగాణలో కులవృత్తులకు గౌరవం
సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకొని ప్రోత్సహించడం వల్ల గౌరవాన్ని ఇచ్చారు. దళితులను వ్యాపార వేత్తలుగా మార్చాలనే కేసీఆర్ కృషి చాలా గొప్పది. మా దగ్గర (ఉత్తరప్రదేశ్‌లో) దళితులను ఇప్పటికీ మనుషులుగా చూసే వాతావరణమే లేదు. దశల వారీగా అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం చేయడం అనేది విప్లవాత్మక సాహసోపేత నిర్ణయం. ఇవన్నీ కేసీఆర్‌తోనే సాధ్యం. అందుకే దేశానికి తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనా విధానం అనుసరణీయం.
తెలంగాణ దారిలో దేశం నడవాలి
తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రజా పోరాటాల నుంచి వచ్చిన నేత కనుక ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా కార్యక్రమాలు చేపట్టారు. వాటిని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల ఇక్కడి ప్రజలు తక్కిన భారత సమాజం కన్నా మంచిగా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పాడిపంటలు, పారే నీటితో ఆకుపచ్చగా మారింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టును చూశాం. వందల మైళ్ల దూరంలో ఉన్న నది నీటిని దారి మళ్లించి బీడుభూములకు పారించటం వల్ల పచ్చని పంటలు పండుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాలు, రాష్ర్టాల్లో తిరిగా. కానీ, ఎక్కడా ఇటువంటి వాతావరణాన్ని చూడలేదు. తెలంగాణలో మాదిరిగా రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు మరెక్కడా లేవు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుబంధ రంగాలను అదే స్థాయిలో కాపాడారు.