MP Suresh Reddy | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని, ఈ సమయంలో వారి మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడవద్దని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలమంది ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఏపీ, తెలంగాణను సైంటిఫిక్‌గా విభజించలేదని పదేపదే మాట్లాడుతున్న ప్రధానమంత్రి, దానిని సరిచేయడానికి తన 9 ఏండ్ల పాలనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాలు పరిష్కరించారా? నీటి కేటాయింపులు చేశారా? తెలంగాణకు ఏమైనా ప్రత్యేక కేటాయింపులు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రయాన్ -3 విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.