Tejashwi Yadav : రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో అందులోని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ఏసీలు, సోఫాలు, బెడ్ ట్యాప్స్ లాంటివి మిస్సయ్యాయని పేర్కొంది.
ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు. ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేటాయిస్తూ ఇటీవల నితీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాంతో గత ఆదివారం తేజస్వి ఆ నివాసాన్ని ఖాళీ చేశారు.
బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత వెళ్లి చూడగా అందులోని పలు వస్తువులు కనిపించకుండా పోయాయని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి దానిశ్ ఇక్బాల్ వెల్లడించారు. ఏసీ, బెడ్, సోఫాలు, మొక్కల కుండీలు, జిమ్ పరికరాలు, వాష్‌రూమ్‌లో నల్లాలు కూడా పట్టుకెళ్లిపోయారని ఆరోపించారు. ఏయే వస్తువులను తీసుకెళ్లారో ఆ జాబితాను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. దాంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై ఆర్జేడీ స్పందించాల్సి ఉంది.