Tejashwi Yadav : జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం దేశంలో ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలికేందుకు తీసుకొచ్చిన నినాదమని ఆరోపించారు. తేజస్వి యాదవ్ గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సస్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ ఎప్పుడూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని కోరుకుంటాయని దుయ్యబట్టారు.
పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెడితే బిల్లులో లోటుపాట్లను తాము ప్రస్తావిస్తామని చెప్పారు. ఒక పార్టీ ఒకే ఎన్నిక ఆపై నో ఎలక్షన్ వన్ లీడర్ నినాదాన్ని కాషాయ పాలకులు తెరపైకి తీసుకొస్తారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్ధలన్నింటికీ తూట్లు పొడవాలని వారు కోరుకుంటారని చెప్పారు. ఇక బిహార్‌లోని నవాడ ఘటనపై తేజస్వి యాదవ్ మాట్లాడుతూ దళితులపై దమనకాండ జరుగుతుంటే నితీష్ కుమార్ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ ఆయన కుమారుడు ఆరెస్సెస్ స్కూల్లో చదివారని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ స్క్రిప్ట్‌ను మాంఝీ చదివివినిపిస్తున్నారని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో వారే ఉన్నా దోషులపై చర్యలు చేపట్టకుండా వారిని ఎవరు అడ్డుకున్నారని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. దళితులపై దాడులకు పాల్పడుతుంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోందని అంతకుముందు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. దళితులను కాపాడటంలో బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు.
Read More :
Adani Group Donation | ఆంధ్రప్రదేశ్‌కు అదానీ గ్రూప్ రూ. 25 కోట్ల భారీ విరాళం